గంగను భరించడంలో అంతరార్థం?
గంగను భరించడంలో అంతరార్థం,
చంద్రుని పొందడంలో అంతర్యం ?
గంగను భరించడంలో అంతరార్థం?
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు. అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు. అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కార్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్రవహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకాలను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.
చంద్రుని పొందడంలో అంతర్యం?
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం. మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు శంకరుడు.
Comments
Post a Comment